మద్యం మత్తులో జరిగిన మాటల యుద్ధం మర్డర్ కు దారితీసింది. స్నేహితుల మధ్య వచ్చిన కలహం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓల్డ్ ఘాస్ మండికి చెందిన బుక్యా శివాజీ అనే యువకుడు డీటీడీసీలో కొరియర్ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితులతో బయటకు వెళ్లిన యువకుడు తెల్లారే సరికి శవంగా మారాడు.
మద్యం మత్తులో ఉన్న అతని స్నేహితులు గొడవపడి శివాజీపై దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి కారులో పారిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
ఆదివారం రాత్రి స్నేహితులు శివాజీపై దాడి చేసి కారులో పరారైనట్లు గుర్తించారు. అతని స్నేహితుడితో పాటు మరికొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.