ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లపై అక్రమంగా నమోదైన కేసులను ఖండిస్తున్నామన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాల కోసం శాంతియుతంగా పోరాడుతున్న ప్రొఫెసర్ కాశీంతో పాటు 20 మంది ఓయూ ప్రొఫెసర్లపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ విద్యా వ్యవస్థను నాశనం చేసి, మద్యాన్ని చవకగా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఒక తరాన్ని నాశనం చేసినందుకు ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
కాగా మంగళవారం విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఓయూలోని ఆర్ట్స్ కాలేజీలో దీక్ష చేస్తున్న ప్రొఫెసర్ కాసీంను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను, వామపక్ష ప్రజా సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రొఫెసర్ కాసీంతో పాటు మంద కృష్ణ మాదిగను పోలీసులు బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రజాసంఘాల నేతలను, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు మలక్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వారి అరెస్టుల నేపథ్యంలో ఓయూ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఓయూలో పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆయన దీక్ష చేస్తున్నారు.