పొగమంచు కారణంగా బీఎస్ఎఫ్ జవాన్ పాకిస్థాన్ గడ్డపైకి వెళ్లిపోయాడు. భారత జవానును గుర్తించిన పాక్ రేంజర్లు ఆయనను ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటన బీఎస్‌ఎఫ్ ఫిరోజ్‌పూర్ సెక్టర్‌లో జరిగింది. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. సరిహద్దుల్లో తీవ్రమైన పొగమంచు కారణంగా జీరో లైన్ కనిపించకపోవడం వల్లనే జవాన్ పాకిస్థాన్ గడ్డపైకి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులోని అబోహర్ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఓ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ బుధవారం ఉదయం 7.40 గంటలకు పొరపాటున జీరో లైన్ ను దాటి పాకిస్తాన్ భూభాగానికి చేరుకున్నాడు. దట్టమైన పొగమంచు కారణంగా సరిహద్దు దాటినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
పాకిస్తాన్ ప్రాంతానికి చేరుకోగానే పాక్ రేంజర్లు భారత జవాన్ ను అదుపులోకి తీసుకున్నారు. సదరు జవాన్ బీఎస్‌ఎఫ్‌లోని 66 బెటాలియన్‌కు చెందినవాడు. జవాను సరిహద్దు దాటినట్లు సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. భారత జవాను తమ నిర్బంధంలో ఉన్నట్లు పాక్ రేంజర్లు ధృవీకరించారు. మన జవాన్ ను తిరిగి పంపేందుకు పాక్ రేంజర్లు నిరాకరించారు.
ప్రస్తుతం జవాన్ ను వదిలిపెట్టడానికి పాక్ రేంజర్లు నిరాకరించడంతో బీఎస్‌ఎఫ్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే గత వారం కూడా ఓ బీఎస్‌ఎఫ్ జవాను ఇలాగే దారి తప్పి పాక్ భూభాగంలో వెళ్లిపోయాడు. బీఎస్‌ఎఫ్ అధికారులు పాక్ రేంజర్లను సంప్రదించి జవానును క్షేమంగా తీసుకురాగలిగారు.