పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో అక్రమంగా ప్రవేశించాలనుకున్న పాక్ డ్రోన్ ను బీఎస్ ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో గురుదాస్పూర్ సెక్టార్ లో ఉన్న భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి డ్రోన్ రావడాన్ని జవాన్లు గుర్తించారు.
దానిపై కాల్పులు జరపడంతో అది కూలిపోయింది. అనంతరం ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టామని బీఎస్‌ఎఫ్ డీఐజీ వెల్లడించారు. డ్రోన్ సాయంతో సరిహద్దుల్లో ఏవైనా వస్తువులను వదిలారా అనేకోణంలో గాలిస్తున్నామని చెప్పారు.
ఆ డ్రోన్ పాక్ నుంచి ఏదో కన్‌సైన్‌మెంట్‌ను తీసుకొచ్చిందని అనుమానం వ్యక్తంచేశారు.డ్రోన్‌పై జవాన్లు మొత్తం 17 రౌండ్ల కాల్పులు జరిపారని చెప్పారు. దీంతో దాని బ్లేడ్ ఒకటి దెబ్బతిన్నదని వెల్లడించారు. అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకుంటున్నామని తెలిపారు.
గత తొమ్మిది నెలల్లో పాకిస్థాన్ వైపు నుంచి మొత్తం 191 డ్రోన్లు భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డాయని చెప్పారు. ఇవి అంతర్గత భద్రతకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని వ్యాఖ్యానించారు.