జమ్మూ కశ్మీర్ లో దొంగచాటుగా తమ ఉగ్రవాదులను పంపడమే కాదు. పాకిస్తాన్ భారత భూభాగంలోకి తన డ్రోన్లను కూడా పంపుతోంది. భారత జవాన్లకు, లేదా సైనిక స్థావరాలకు నష్టం కల్గించాలన్న పాక్ కుతంత్రం మరొకటి బయటపడింది. పంజాబ్.. అమృత్ సర్ లోని అంజలా సబ్ డివిజన్ పరిధిలో 12 కేజీల బరువైన భారీ డ్రోన్ ని పసిగట్టిన బోర్డర్ సెక్యూరిటీ దళాలు నిన్న రాత్రి కూల్చివేశాయి.
భైనీ గిల్ అనే గ్రామ సమీపంలోని . భారత-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎగురుతున్న ఈ డ్రోన్ పైకి భద్రతాదళాలు కాల్పులు జరిపి కూల్చివేసినట్టు సైనికవర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో కేవలం మూడు రోజుల్లో జరిగిన రెండో సంఘటన ఇది.. 8 ప్రొపెల్లర్లు ఉన్న ఈ డ్రోన్ కి తీవ్ర నష్టం కలిగించినట్టు ఈ వర్గాలు వెల్లడించాయి.
ఇందులోని మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నాయి. ఇంకా దీనికింద ఆకుపచ్చని ప్యాకెట్ ఉందని, ఇందులో రెండు కేజీల మెటీరియల్ ఉన్నట్టు తేలిందని తెలుస్తోంది.
బహుశా ఈ ప్యాకెట్ లో మాదకద్రవ్యాలు ఉన్నట్టు భావిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ ఇలా మాదకద్రవ్యాలను కూడా జారవిడుస్తోందని లోగడ మిలిటరీవర్గాలు పేర్కొన్నాయి. అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు ఎప్పటికప్పుడు పాక్ డ్రోన్ల పని పడుతున్నారు.
పంజాబ్ లోనే గురుదాస్ పూర్ సెక్టార్ లో ఈ నెల 13-14 తేదీల్లో పాక్ డ్రోన్ ని కూల్చివేశారు. ఇది కూడా పెద్దదేనని జవాన్లు తెలిపారు.