బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి హైదరాబాద్ పోలీసులను అభినందించారు. ”దిశ” నిందితుల విషయంలో పోలీసుల చర్య ప్రశంసనీయమన్నారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ పోలీసులను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఉత్తరప్రదేశ్ లో ప్రతి రోజు, ప్రతి జిల్లాలో అత్యాచారం సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. కామాంధులు బాలికలు, యువతులు, వృద్ధులు ఎవరిని వదలడం లేదన్నారు. తమ రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుందని విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేప్ కేసులో ఉన్న తన సొంత పార్టీ వారిని కూడా వదల లేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసుల్లో మార్పు రావాలని కోరారు.
న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. హైదరాబాద్ లో గ్యాంగ్ రేపు జరిగిందని తెలియగానే ప్రజలు యూపీలోని ”ఉన్నావో” లో ఉన్నామా…హైదరాబాద్ లో ఉన్నామా అనే అయోమయంలో ఉన్నారని…అదే నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్లో కాల్చివేసినట్టు తెలియగానే ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసి స్వీట్లు పంచుకున్నారన్నారు. ఇదంతా చూస్తుంటే ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం కోల్పోతున్నారని…న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అన్నారు.