బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని కోరుతూ ఆయన దీక్షకు దిగారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఎస్పీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు, బీఎస్పీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ప్రవీణ్ కుమార్ ను వెంటనే విడుదల చేయాలంటూ బీఎస్పీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను, మా పార్టీ కార్యకర్తల అరెస్ట్ ను ఖండిస్తున్నానన్నారు. టీఎస్‌పీఎస్సీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో విఫలమయ్యాయని.. పరీక్షలు పేపర్స్ లికేజీ వెనుక పెద్దల హస్తం ఉందని తేల్చి చెప్పారు. ఇది 30లక్షల నిరుద్యోగుల సమస్య అని.. టీఎస్పీఎస్సీని నమ్మినందుకు నిరుద్యోగులను నిండా ముంచారని మండిపడ్డారు ఆర్ఎస్పీ. ఐపీ అడ్రెస్ తో హ్యాక్ చేసారన్నది కేవలం కల్పితమన్నారు.
సాఫ్ట్‌వేర్ ద్వారా దొంగలించడం అంత సులభం కాదు.. శంకర లక్ష్మి ద్వారా పాస్ వర్డ్ తీసుకోవడం అసాధ్యమన్నారు. ప్రవీణ్, రాజశేఖర్ వెనుక ఎవరు ఉన్నారో తెలియాలి. దీనికి టీఎస్పీఎస్సీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉద్యమిస్తున్న మా లాంటి వాళ్ల ఫోన్లను ట్రాప్ చేస్తున్నారు.. మా ఆందోళనతో గ్రూప్ 1 పరీక్ష రద్దు చేశారు.. మంచి నిర్ణయమన్నారు ఆర్ఎస్పీ.
ఈ వ్యవహారంలో ప్రవీణ్ కేవలం పావు మాత్రమేనని.. హరీష్ రావు, కేటీఆర్ లకు కూడా పరీక్ష పేపర్లు వెళ్లాయని ఆరోపించారు. అలాగే ఎమ్మెల్సీ కవిత మనుషులకు కూడా పేపర్లు అందాయన్నారు ప్రవీణ్ కుమార్. ఈ ఆధారాలు నేను సీబీఐ లేదా హైకోర్ట్ కు అందిస్తానని.. సీఎం కేసీఆర్ పై నమ్మకం లేదని పనేర్కొన్నారు. ఆర్టికల్ 310 ప్రకారం గవర్నర్ జనార్దన్ ను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారం నుంచి చైర్మన్ జనార్థన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ వ్యవహారంపై ప్రభుత్వం, మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు. నిరుద్యోగులు ఆంటే మంత్రులకు లెక్క లేదు.. లిక్కర్ స్కామ్, టీఎస్‌పీఎస్సీ స్కామ్ లపై కేసీఆర్ మాట్లాడాలన్నారు. ఈ స్కామ్ వెనుక పెద్ద తలలు ఉన్నాయి. జైల్లో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ ప్రాణాలు కాపాడాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్.