గత తొమ్మిదేళ్లుగా అలంపూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా బుధవారం 191వ రోజు అలంపూర్ మండలంలోని ఇమంపూర్, లింగనవాయి, క్యాతోల్, ఉండవల్లి మండలంలోని శేరిపల్లి, ప్రాగటూర్, మారమునగల గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గంలో ఆర్.డి.ఎస్ కాలువ మరమ్మత్తులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, ఇళ్ల నిర్మాణాలు వంటి అనేక పనులున్నాయని ఆయన పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి 50 కోట్లు ప్రకటించిన కేసీఆర్.. అలంపూర్ నియోజకవర్గానికి వెయ్యి కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ యూపీ ఫార్ములా అంటే ఏమిటో చెప్పాలన్నారు. పేదల ఇండ్లు కూల్చడం, పేదలపై దాడులు చేసి చంపడం, మహిళలపై అత్యాచారాలు చేయడమే యూపీ ఫార్ములానా అని నిలదీశారు. తెలంగాణలో మతోన్మాద రాజకీయాలను రానివ్వమన్నారు. సిరిసిల్లలో డబుల్ బెడ్రూం పట్టాలు పంచిన కేటీఆర్ కు అలంపూర్ కనిపించడం లేదా అని నిలదీశారు ప్రవీణ్ కుమార్. సిరిసిల్ల విద్యార్థులకు ఎలాంటి సహాయం అందించారో.. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అందించాలన్నారు.
అలంపూర్ మున్సిపాలిటీకి 20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అత్యధికంగా కరెంట్ బిల్లులు వసూలు చేస్తూ, 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు ప్రవీణ్ కుమార్. నియోజకవర్గంలో అగ్రికల్చర్, వెటర్నరీ, పాలిటెక్నిక్ కళాశాలలు కావాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలకు ఎలాంటి సాయం అందడం లేదన్నారు. నేతన్నలపై జీఎస్టీ భారం మోపి ఆత్మహత్యలకు కారకులవుతున్నారని తెలిపారు.
యాత్రలో భాగంగా ఉదయం వాకింగ్ లో కూలీచేసే మహిళలను ప్రవీణ్ కుమార్ కలిశారు. అలంపూర్ కేంద్రంలో పారిశుధ్య కార్మికులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యలకు ఏకైక మార్గం బహుజన రాజ్యం రావడమేనన్నారు. బహుజన రాజ్యంలోనే మన బతుకులు మారతాయన్నారు. అందుకే ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా అధ్యక్షులు కేశవరావు, మహిళా నాయకురాలు రాములమ్మ, నియోజకవర్గ నాయకులు మహేష్, కనకంబాబు, సుంకన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.