తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటేనని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా రేకుర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 194 సర్వే నంబర్ లోని పేద ముస్లింల ఇండ్లను కొందరు వ్యక్తులు కూల్చివేయగా వాటిని పరిశీలించారు.
రేకుర్తిలోని పేదల స్థలాలను అధికార పార్టీ నేతలు ఆక్రమిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ గుండాలు బుల్డోజర్ తీసుకువచ్చి పేద ప్రజల ఇండ్లను కూల్చారని ఆరోపించారు ప్రవీణ్ కుమార్. కేసీఆర్ ప్రభుత్వ హయంలో నిరుపేద ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. కరీంనగర్ లోని బీఆర్ఎస్ నాయకులు బుల్డోజర్ సర్కారును తలపించేలా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని పేద ప్రజలకు బీఎస్పీ అండగా ఉంటుందని ప్రవీణ్ కుమార్ భరోసా ఇచ్చారు. 30 సంవత్సరాల క్రితమే ఈ భూములు పేదలకు ఇచ్చారని.. ఇండ్లు కట్టుకోమన్నారు కానీ కరెంటు సప్లై ఇవ్వలేదని తప్పుబట్టారాయన. బీఆర్ఎస్ గుండాలు ఇక్కడికి వచ్చి ఇండ్లను కూలగొట్టారని..పేద ప్రజల స్థలాలను రియల్ ఎస్టేట్ గా మార్చారని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ అండతోనే గంగుల కమలాకర్ అనుచరులు ఇండ్లు కూలగొట్టారని విమర్శించారు ప్రవీణ్ కుమార్. గంగుల కమలాకర్, బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే అని..పేదల ఇండ్లు ఆక్రమంగా కూల్చేసినా వాళ్లు ఇప్పటి వరకూ ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ది బుల్డోజర్ గవర్నమెంట్.. ఈ బుల్డోజర్ సర్కార్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.