టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూస్వాముల వర్గానికే కాంట్రాక్టులు వెళ్లాయని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఓట్ల కోసం బహుజనులను టీఆర్ఎస్ మభ్య పెడుతున్నదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రవీణ్ మాట్లాడారు.
బహుజనులు 75 ఏళ్లుగా బానిసలుగానే బతుకున్నారని తెలిపారు. విగ్రహాల ఏర్పాటుతో బహుజనుల జీవితాలు మారబోవని, రాజకీయ అధికారం సాధించుకోవాలని పేర్కొన్నారు. రెడ్లతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
ఎలక్షన్స్ రాగానే బహుజనులకు మద్యం, మనీ ఇవ్వడంతో పాటు చికెన్, మటన్ దావతులు ఇచ్చి మరీ ఓట్లు వేయించుకుంటున్నారని, అలా బహుజనులను రాజకీయ అధికారానికి దూరం చేస్తున్నారని చెప్పారు. బహుజనులకు అధికారం రావాలంటే అందరూ ఏకం కావాలని, ఏనుగు గుర్తుకు ఓటేసి బీఎస్పీని గెలిపించాలని ప్రవీణ్ కోరారు.
బహుజన బిడ్డలు ఓటేసే ముందర ఒక్కసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. బహుజనులకు రాజకీయ అధికారం సాధించేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. బహుజన రాజ్యం వస్తే అసైన్డ్ భూములను పేదలకు పంచుతామని హామీనిచ్చారు. బహుజనులు రాజకీయ అధికారం వైపు అడుగులు వేయాలని కోరారు.