టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను ఆయన ఈ రోజు రాజ్ భవన్‌లో కలిశారు. టీఎస్పీఎస్పీ చైర్మన్ బి. జనార్ధన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని గవర్నర్ ను కోరారు.
ఈ కేసులో సిట్ దర్యాప్తుతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అందువల్ల సీబీఐతో దర్యాప్తు చేయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనార్ధన్ రెడ్డి ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు సంబంధించిన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
మరో వైపు ట్విట్టర్‌లో ఆయన స్పందించారు. సీఎం కేసీఆర్ కు ఏ కొంచెం చిత్త శుద్ది వున్నా టీఎస్‌పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన 15 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయంటూ ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రింట్ అయిన కథనాన్ని ఆయన షేర్ చేశారు.
టీఎస్పీఎస్సీపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదన్న టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ట్వీట్‌కు ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఘంటా చక్రపాణి అమాయకంగా మాట్లాడుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. దీనిపై కొంచెం ఆలోచన చేయాలన్నారు. టీఎస్పీఎస్సీ నియామక మండలిని రాష్ట్ర ప్రభుత్వమే నియమించిందన్నారు.
ఉపాధ్యాయులను, రిపోర్టర్లను, బీఆర్ఎస్ భజన బ్యాచ్‌ను బోర్డు సభ్యులుగా తీసుకున్నది ఎవరు అని ఆయన నిలదీశారు. బోర్డులో చాలా మందికి ఉన్న అర్హత లేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బోర్డు చైర్మన్‌గా మీరు ఉన్న సమయంలోనూ కేసీఆర్ నామినేట్ చేసిన ఓ సభ్యుడు ఉమ్మడి ఏపీలో పరీక్షా పత్రాల లీకేజీ కేసులో జైలుకు పోయిన విషయం మీకు తెలియనిదా అని ఆయన ఫైర్ అయ్యారు.