తెలంగాణ బీజేపీ నేతలపై సీరియస్ అయ్యారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లే.. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు ప్రవీణ్ కుమార్. మహాత్మ జ్యోతిరావు పూలే వర్థం సందర్భంగా గులాంగిరి చేయకుండా బీసీ న్యాయమైన వాటా కోసం పోరాడాలని పేర్కొన్నారు ఆర్ఎస్పీ. బీసీల కుల గణన చేయాలని, బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కూడా నిలదీయాలని సూచించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలని, బీసీల కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు ఆర్ఎస్పీ. తాజాగా ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఉధృత పరచడం కోసం ఆర్ఎస్పీ 15 మందితో కూడిన బీసీ రిజర్వేషన్ పోరాట స్టీరింగ్ కమిటీని ప్రకటించారు.
ఈ కమిటీలో కన్వీనర్ గా డాక్టర్ సాంబశివగౌడ్, కో కన్వీనర్ గా దాసరి హనుమయ్య, సలహాదారులుగా చంద్రశేఖర్ ముదిరాజ్, మహతి రమేష్, రీసెర్చ్ ఇన్ ఛార్జులుగా ఊరుమల్ల విశ్వం, జక్కని సంజయ్ కుమార్, గుర్రప్పలు ఉంటారు.
ఇక కల్చరల్ ఇన్ ఛార్జీలుగా గజ్జెల అశోక్, దయాకరణ్ మౌర్య, కోనేటి సుజాత, మీడియా ఇన్ ఛార్జ్ గా వెంకటేష్ చౌహాన్, కమిటీ సభ్యులుగా నామలక్ష్మి ముదిరాజ్, కత్తుల పద్మ యాదవ్, మౌలానా షఫి, శాంసన్ లను నియమించారు. ఈ కమిటీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించి కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.