పోడు భూములకు పట్టాలిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మోసం చేసిందని అన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన చేపట్టి బహుజన రాజ్యాధికార యాత్ర 89వ రోజు భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో కొనసాగింది. ఉదయం భద్రాద్రి రామయ్యను దర్శించుకుని.. తర్వాత శిల్పినగర్ లో పేదలతో మాట్లాడారు.
రాష్ట్రంలోని ఆదివాసీ, పేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చేద్దామని పిలుపునిచ్చారు ఆర్ఎస్పీ. గిరిజనులు వర్షాకాలంలో పంటలు వేసుకోవడానికి వెళ్తే అటవీ అధికారులు అడ్డుకొని అక్రమ కేసులు పెడుతున్నారని, వారికి బతకడానికి ఉన్న ఒక్క ఆధారాన్ని కూడా దూరం చేసి కడుపు మీద కొడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఒకే సర్వే నెంబర్ ఉన్న భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వకుండా, ధనికులకు ఇవ్వడం అన్యాయం అని పేర్కొన్నారు ఆర్ఎస్పీ. జీవో నెంబర్ 3 ప్రకారం స్థానిక ఆదివాసీలకు ఉండే అవకాశాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తే, తిరిగి కనీసం రివ్యూ చేయలేదని కేసీఆర్ పై ఫైరయ్యారు. ప్రాజెక్టుల పేరుతో పేదల నుండి భూమి తీసుకొని పరిహారం చెల్లించకుండా మోసం చేసి, వాటిని నిర్మించకుండా భూములు మాత్రం తమ దగ్గరే ఉంచుకున్నారని మండిపడ్డారు.
బహుజన రాజ్యంలో ఆదివాసీ ప్రజలకు స్వర్గం ఉంటుందని ప్రకటించారు. గిరిజనుల కోసం అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు ఉన్న ఆదివాసీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎస్సీ,బీసీలకు కూడా రక్షణ చట్టాలు తెస్తామని పేర్కొన్నారు. పోడుభూములకు, అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని మాటిచ్చారు. రాష్ట్రంలోని గుత్తికోయ ఆదివాసీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.