పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ పై బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. 48 గంటల్లో పరీక్షలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో హైదరాబాద్ నడిబొడ్డున 30 లక్షల మంది విద్యార్థులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో భీమ్ దీక్ష ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందరర్బంగా ఆయన మాట్లాడుతూ… టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి ఆయన డిమాండ్ చేశారు. మళ్లీ కొత్తగా కమిషన్ ను నియమించాలని కోరారు.
చైర్మన్ జనార్దన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చైర్మన్ దగ్గర ఉండాల్సిన పాస్ వర్డ్ సెక్రెటరీ దగ్గరికి ఎలా వెళ్ళింది? అని ఆయన ప్రశ్నించారు. దీని వెనకాల పెద్ద పెద్ద మనుషులు ఉన్నారని ఆయన ఆరోపించారు.
నేరస్తులను కాపాడేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలన్నారు. త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని, 30 లక్షల మంది జీవితాలను నాశనం చేస్తున్న విషయాన్ని ఆమెకు వివరిస్తామన్నారు.