రాబోయే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని బహుజన్ సమాజ్ వాది పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి తేల్చి చెప్పారు. ఈ సారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని ఆమె వెల్లడించారు. పొత్తులపై వస్తున్న వార్తలను ఆమె తోసి పుచ్చారు.
కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలు తమతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆమె అన్నారు. కానీ ఆ విషయంలో తమ సిద్ధాంతం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఈవీఎంలపై కూడా ఆమె మాట్లాడారు. ఈవీఎంలలో లోపాలు ఉన్నట్టు ఆమె సందేహం వ్యక్తం చేశారు.
గతంలో బ్యాలట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించినప్పుడు తమ పార్టీకి ఓటింగ్ శాతం, సీట్ల సంఖ్య ప్రతి ఎన్నికలకూ పెరుగుతూ వుండేదన్నారు. ఇకనైనా ఎన్నికలను ఎన్నికల సంఘం పాత బ్యాలట్ పద్ధతిలోనే నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ రోజు మాయావతి తన 67వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఆమె జన్మదినాన్ని అభిమానులు, కార్యకర్తలు జన కళ్యాణ్ దివాస్ పేరిట ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ కోసం, ప్రజల కోసం చేసిన పనులను వివరిస్తూ ఓ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.