చిన్నతనం నుంచి పరిచయం ఉన్న వ్యక్తి .. తెలిసినవాడే కదా అని మాట్లాడుతుంటే గత కొంత కాలం నుంచి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చింది. వారు ఆ యువకుడికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. తీరు మార్చుకోకపోగా ఇంకా వేధింపులు ఎక్కువయ్యాయి.
దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పబ్బోజు శంకర్, రమాదేవి దంపతులకు రక్షిత (20) అనే కుమార్తె ఉంది. అయితే ఆమె నర్సంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్ లో ఉంటోంది.
స్వగ్రామంలో పదో తరగతి చదివే రోజుల్లో ఆమెకు పరిచయం అయిన రాహుల్ కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఆమె చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. విషయాన్ని రక్షిత తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వాళ్లు భూపాల పల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
అయినా అతడిలో మార్పు రాలేదు. శివరాత్రికి భూపాలపల్లికి వెళ్లిన రక్షిత కళాశాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి ఇంటి నుంచి బయలు దేరింది. కానీ కళాశాలకు చేరుకోలేదు. దీంతో తమ కూతురు కనిపించడం లేదని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు రక్షిత తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.
హాస్టల్ లో ఉండే ఇబ్బంది అవుతుందంటూ వరంగల్ రామన్నపేటలోని తన సోదరుడి ఇంటికి తండ్రి శంకర్ పంపించాడు. మిస్సింగ్ కేసు విషయంలో సోమవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉండగా…. ఆదివారం రక్షిత తన బాబాయి ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయింది. రక్షిత మూడు నెలల కిందట హాజరు తక్కువగా ఉండటంతో డిటైన్ అయినట్లు సమాచారం. దీంతో పాటు రాహుల్ వేధింపులు కూడా ఎక్కువ అవ్వడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తండ్రి కాంట్రాక్ట్ పని మీద జార్ఖండ్ వెళ్లారు. రాహుల్ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటున్న రాహుల్ ని భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.