మూడు రాజధానుల బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం పెట్టిన3రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడం బాధాకరమన్నారు. ఇప్పటికే 80శాతం పనులు పూర్తయిన అమరావతిలోనే పూర్తి స్థాయిలో రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేసిన బుద్ధప్రసాద్ వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల పై గౌరవం లేకుండా వ్యవహరిస్తోందని, ఎన్నిమార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాల్లన్నట్లు వ్యవహరిస్తోందని సాధ్యాసాధ్యాల గురించి పట్టించుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రజాధనం వృధా అవుతోందన్నారు బుద్ధ ప్రసాద్. ప్రభుత్వం తీసుకువచ్చిన 3 రాజధానుల నిర్ణయం న్యాయ సమీక్షకు నిలువదని ధీమా వ్యక్తం చేశారు. స్థానికంగా కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగటంలేదని…జరుగుతోంది కేవలం ఇసుక మట్టి దోపిడీ మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.