ఏపీలో షర్మిల పార్టీ పెడితే అందులో చేరి జగన్ ని తిట్టే మొదటి వ్యక్తి కొడాలి నాని అని విమర్శించారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న. ప్రజలకు మేలు చేయటం చేతకాకే చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే పోలీసులు లేకుండా చంద్రబాబు ఇంటికి రా.. నీ శవాన్ని పంపుతాం.. లేకపోతే మేము చస్తాం అంటూ ఘాటైన విమర్శలు చేశారు.
గుడివాడలో బస్సులు, లారీల్లో కొడాలి నాని ఆయిల్ దొంగతనం చేస్తే అప్పుడు పోలీస్ అధికారిగా ఉన్న వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా అని ప్రశ్నించారు బుద్ధా. చంద్రబాబు సీఎం అయ్యాకే తెలుగుదేశంలో ఆయనకు స్థానం దక్కిందని గుర్తుచేశారు. హరికృష్ణ గుడివాడలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే, మధ్యలో వదిలేసి పారిపోయిన వ్యక్తి కొడాలి నాని అని విమర్శించారు.
కేసినోలో రూ.250 కోట్లు చేతులు మారాయన్న బుద్ధా.. డీజీపీకి ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించారు. కొడాలిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. 70 సంవత్సరాల వయసున్న చంద్రబాబును బూతులు తిడుతుంటే డీజీపీ ఎందుకు మాట్లాడరని మండిపడ్డారు.
కొడాలి నాని అండ్ కో జగన్ పార్టీని సర్వనాశనం చేశారని, అతని లాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడమే చంద్రబాబు చేసిన పొరపాటు అని అన్నారు వెంకన్న. ఆయన గానీ ఇంకెవరైనా గానీ చంద్రబాబు గురించి మాట్లాడితే తాము పది రెట్లు మాట్లాడతామన్నారు.