టీడీపీ నేత బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసినో వ్యవహారంపై మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
బుద్ధా చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు 3 గంటలపాటు పోలీసులకు బుద్ధాకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. ప్రెస్ మీట్ తర్వాత బుద్ధా ఇంటికి వెళ్లారు పోలీసులు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కొరారు. ఈ విషయంలో చాలా సేపు వాదులాట కొనసాగింది.
ఏం జరిగినా సిద్ధంగా ఉన్నానంటూ బుద్ధా వెంకన్న తెగేసి చెప్పారు. తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనన్నారు. డీజీపీ సవాంగ్.. సీఎం జగన్ కు తొత్తుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో.. బుద్ధాను అరెస్ట్ చేశారు పోలీసులు. టీడీపీ శ్రేణులు ఈ అరెస్ట్ ను ఖండించాయి.
చంద్రబాబు ఇంటివైపు వస్తే కొడాలి నానిని చంపడానికైనా.. తాను చావడానికైనా సిద్ధమని ప్రెస్ మీట్ లో అన్నారు బుద్ధా వెంకన్న. గుడివాడలో ఇంత జరిగినా రాష్ట్ర డీజీపీ స్పందించరా అని ప్రశ్నించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే టీడీపీ వారిపై కేసులు పెడతారా.. చట్టం ముఖ్యమా?.. తాడేపల్లి ఆదేశాలు ముఖ్యమా?.. సంస్కారం లేకుండా చంద్రబాబును తిడుతుంటే చోద్యం చూస్తారా అంటూ మండిపడ్డారు. కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు.
సెక్షన్ 153ఏ, 506, 505(2), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మంత్రిని చంపుతా, రక్తం కళ్ళ చూస్తా అన్నందుకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వన్ టౌన్ పీఎస్ లో బుద్ధాపై కేసు నమోదైంది.