ఏపీలో రాజకీయాలు..బీసీల చుట్టూ తిరుగుతూ.. వేడెక్కుతున్నాయి. జయహో బీసీ నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి వెళ్లనీయకుండా టీడీపీ నేత బుద్దావెంకన్నను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నేత ఇంటి వద్దే బైఠాయించి నిరసన తెలిపారు.
ఆయన చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బుద్దావెంకన్న మాట్లాడుతూ.. బీసీలకు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బీసీలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది చంద్రబాబే అని గుర్తుచేశారు. చంద్రబాబు రోడ్ షోలలో బీసీలు ఎక్కువగా పాల్గొంటున్నారనే జయహో బీసీ సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు.
కనీసం కలెక్టర్ కు మెమొరాండం ఇవ్వడానికి బయలుదేరితే ఆపడం ఏంటనే ఆయన మండిపడ్డారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని కలెక్టర్ కు మెమొరాండం ఇస్తే వాళ్లకేమవుతుందని ప్రశ్నించారు. బీసీ వ్యక్తిగా తనకు కలెక్టర్ ను కలిసే అర్హత లేదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్దావెంకన్న.
బీసీలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.