– బడ్జెట్ సమావేశాల్లో బీజేపీపై టీఆర్ఎస్ ఫోకస్
– గవర్నర్ ప్రసంగం విషయంలో తప్పుపట్టాలని ప్రతిపక్షాల ప్లాన్
– వాటిని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
– ప్రధాన టార్గెట్ గా ఈటల
– టీఆర్ఎస్ కొత్త వ్యూహాలు
– నేటినుండి బడ్జెట్ సమావేశాలు
రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుంతో ఎవరికీ తెలియదు. అది నిజమే అనేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై టీఆర్ఎస్ ఫోకస్ చేసినట్టు సమాచారం. నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్ ను టార్గెట్ గా పెట్టుకున్న టీఆర్ఎస్.. ఈసారి బీజేపీపైనే బాణాన్ని ఎక్కు పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ వ్యవస్థనే ప్రశ్నించడం ద్వారా బీజేపీని ఇరుకున పెట్టవచ్చని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
అందులో భాగంగానే సరికొత్త వ్యూహాలను రచిస్తున్నట్టు సమాచారం. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని నిలిపివేశారు. అయితే.. అదే విషయంలో అధికార పార్టీని తప్పుపట్టాలని కాంగ్రెస్, బీజేపీ నిర్ణయించుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదంటూ విమర్శించాలనుకుంటున్నాయి. దీనిని పసిగట్టిన టీఆర్ఎస్ గట్టిగానే కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయనేది రాజకీయ వర్గాల మాట.
హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత వ్యూహం మార్చుకున్న టీఆర్ఎస్.. ఈ సమావేశాల నుంచే దూకుడు పెంచాలనుకుంటుందని టీఆర్ఎస్ వర్గాలు. అయితే.. బీజేపీలో కేవలం ముగ్గురు సభ్యులే ఉన్నందున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడా తగ్గేదే లే అనే తీరులో సరిగ్గా కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకు అవసరమైన ఉదాహరణలను, సంఘటనలను ఇప్పటికే రెడీ చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ప్రతిపక్ష స్థానంలో ఈటల హుజూరాబాద్ ఫలితాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోయింది. అప్పటి నుంచే బీజేపీ వ్యతిరేక వైఖరి మొదలైంది. ఇంతకాలం మంత్రి హోదాలో అసెంబ్లీలో అధికార పార్టీ స్థానంలో కూర్చున్న ఈటల.. ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో పోటీగా నిలిచారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసినందున ఇప్పుడు బడ్జెట్ పై బీజేపీ తరఫున చర్చలో కీలకంగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న మంత్రి హరీశ్‌రావు, చర్చల సందర్భంగా అవసరమైతే జోక్యం చేసుకునే సీఎం కేసీఆర్.. దీర్ఘకాలంగా ఈటల రాజేందర్ తో సన్నిహితంగా ఉన్నవారే కావడం గమనార్హం.
ఇంతకాలం ప్రభుత్వ పథకాలను ప్రశంసించిన ఈటల.. ఇప్పుడు విమర్శించే పాత్రను పోషించబోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాటి ఆధారంగానే ఆయన చేసే కామెంట్లను గట్టిగా తిప్పికొట్టి.. అవసరమైతే గతంలో ఇదే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అభినందించిన అంశాలను తేదీలతో సహా గుర్తుచేసి ఈటల నోరు మూయించాటానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్దమవుతున్నారనేది తెలుస్తోంది. తెలంగాణ బడ్జెట్‌ను బీజేపీ సభ్యులు తప్పుపట్టే ప్రయత్నం చేస్తే దానికి కౌంటర్ గా కేంద్ర బడ్జెట్ లో ఏమిచ్చిందో ఉదాహరణలతో సహా వివరించే కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ను కార్నర్ చేయకపోవచ్చని సమాచారం.
ఇప్పటివరకు జరిగిన అన్ని అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలకు సీఎం కేసీఆరే స్వయంగా స్పందించి.. ‘ఇదంతా మీ పాపమే గదా.. మీకు తెలివి ఉంటే కల్యాణలక్ష్మి, రైతుబంధు లాంటి పథకాలను పెట్టలేదెందుకు?..’ అంటూ తనదైన శైలిలో తిప్పికొట్టారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం కాంగ్రెస్ పుణ్యమేగదా అంటూ సెటైర్లు కూడా వేశారు. ఇకపై ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ పైన చేయకపోవచ్చనే వార్తలు టీఆర్ఎస్ వైపు నుంచి వినిపిస్తున్నాయి. పోకస్ బీజేపీపై పెట్టడం ద్వారా ప్రధాన ప్రత్యర్థి ఆ పార్టీయే అనే ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.