– ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగుపెట్టిన గవర్నర్
– కేసీఆర్ తో పలకరింపులు
– ప్రభుత్వ పథకాలపై కొనసాగిన ప్రశంసలు
– తమిళిసై తీరుపై ప్రతిపక్షాల అసహనం
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం బీఏసీ సమావేశం నిర్వహించారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేపట్టాలని నిర్ణయించారు. 6న ఆర్థిక మంత్రి హరీష్ రావు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 7న సెలవు ప్రకటించారు. 8న బడ్జెట్, పద్దులపై చర్చించనున్నారు. 8న మరోసారి భేటీ అయి సమావేశాల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
ఇటు శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని.. దేశానికే ధాన్యాగారంగా మారిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో మార్పు కనిపిస్తోందని.. తెలంగాణ అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ అంటూ వ్యాఖ్యానించారు.
సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ వన్ గా దూసుకెళ్తోందన్న ఆమె.. ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించిందని.. తెలంగాణ గ్రామాలలో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని వివరించారు.
కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ధృడ నిశ్చయంతో మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని అన్నారు. 65 వేల కోట్ల పంట పెట్టుబడి ఇచ్చారని.. తెలంగాణ ఎన్నో విజయాలు సొంతం చేసుకుందని తెలిపారు గవర్నర్. అభివృద్ధిలో సీఎం, ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉందని కొనియాడారు.