తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బడ్జెట్ ఆమోదంపై గవర్నర్ తమిళి సై అనుమతి తెలపకపోవడం పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. లంచ్ మోషన్ కు అనుమతించాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు.
లంచ్ మోషన్ మెన్షన్ చేసిన సందర్భంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్య చేసింది. ఇందులో న్యాయవ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుందని వ్యాఖ్యానించింది. లంచ్ మోషన పిటిషన్ కు అనుమతిస్తే తాము పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుశ్వంత్ ధవే వాదనలు వినిపించనున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం వేసిన లంచ్ మోషన పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. మధ్యాహ్నం ఒంటి గంటకు హైకోర్టు విచారించనుంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఆమోదం తెలపకపోవడంతో గవర్నర్ తీరుపై శాసన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని చెప్పారు. వక్రబుద్ధితో ఆలోచన చేసే వాళ్లకు మంచి బుద్ధి కలగాలన్నారు. దేశంలో మతోన్మాద శక్తులు దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు.
ధనికుల ధనాన్ని పేదలకు పంచిపెడతాం అనే వ్యాఖ్యలు మాటలకు మాత్రమే పరిమితం కావొద్దని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని,అహంకార ధోరణితో ఉండొద్దని మహాత్మాగాంధీ అనేవారని చెప్పారు. ప్రభుత్వాలు మారడం కాదు..ప్రజల బతుకులు మారాలన్నారు.
ఇక ఇలా ఉంటే..వరుసగా రెండో సారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్ కు ఎట్లా ఆమోదం తెలపాలని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళి సై లేఖ రాసినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్ ను ఎందుకు నిర్వహించడం లేదని గవర్నర్ లేఖలో ప్రశ్నించారు. అయితే తెలంగాణ సర్కార్ వర్సెస్ గవర్నర్ నడుస్తున్న ఈ వివాదంలో హైకోర్టు ఏం తీర్పునిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.