పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. సోమవారం ఎకనామిక్ సర్వేను విడుదల చేసిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 100 సంవత్సరాల లక్ష్యాన్ని తాము నిర్దేశించుకున్నామని తెలిపారు. ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ రానున్న 25 ఏళ్ళకు ఆర్థిక వ్యవస్థకి బ్లూప్రింట్ అని అన్నారు.
ద్రవ్య స్థితిపై పూర్తి పారదర్శకతను పాటిస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. తాము చేపడుతున్న చర్యలకు చెప్పుకోదగ్గ ఫలితాలు వస్తున్నాయన్నారు. స్వయం సమృద్ధి సాధించడంపై ఈ బడ్జెట్ దృష్టి పెట్టిందన్నారు.
మూల ధన వ్యయం పెరిగిందని చెప్పారు. ఆధునిక మౌలిక సదుపాయాలకు ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం రాబోతోందన్నారు. వెనుకబడిన వర్గాలు, యువత, రైతులపై ఈ బడ్జెట్ లో ప్రధాన దృష్టి పెట్టినట్టు తెలిపారు.
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆమె రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిశారు. ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయానికి వెళ్లి అక్కడ నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 3.45 గంటలకు విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తారని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.