నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా.. డుగ్గుడుగ్గంటూ అనే పాట తెలుగు రాష్ట్రాల్లో వినని వారుండరు. జానపద పాటలవైపు యువత పరుగులెడుతున్న నేపథ్యంలో ఈ పాట తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. సినీ సింగర్ మోహన భోగరాజు పాడినప్పుడు ఈ పాట అంతగా ప్రజల్లోకి వెళ్లలేకపోయినా.. గోదావరిఖనికి చెందిన ఓ పెళ్లి కూతురు చేసిన డాన్స్ తో ఓవర్ నైట్ లోనే పాపులర్ అయింది.
అప్పటి నుండి ఏ పెళ్లిలో చూసినా ఈ సాంగ్ లేకుండా జరగలేదంటే ఏమేరకు ఈ పాట పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ డీజే పెట్టినా ఆ పాటకు పిల్లల నుండి ముసలివాళ్ల వరకు డాన్స్ లు వేస్తూ అలరించేంతగా పాపులర్ అయింది.
అంతటి ప్రాచుర్యం పొందిన ఈ పాటకు మరోసారి గుర్తింపు దక్కింది. ఆ పాటకు వేయి మంది యువతులు, పిల్లలు ఒకేసారి డాన్స్ చేశారు. ఇలా ఒక పాటకు ఇంత మంది డాన్స్ చేయడంతో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది ఆ పాట.
జిల్లాలోని మిని స్టేడియంలో ఈ డాన్స్ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. దీంతో వేయి మంది పాల్గోన్నారు. ఈ డాన్స్ లో ఎక్కువగా యువతులు, పిల్లలు డాన్స్ చేయడంతో చాలా ఆకర్షణగా కనిపించింది. ప్రజాప్రతినిధులతో పాటు.. పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొనడంతో కార్యక్రమం కలర్ ఫుల్ గా కొనసాగింది.