విమానాల్లో ప్రయాణిస్తుండగా కింది నుంచి బుల్లెట్ దూసుకుని వచ్చి ప్రయాణికులు గాయపడడం ఎప్పుడైనా చూశామా ? కానీ మయన్మార్ లో మాత్రం ఇలాంటి అరుదైన ఘటన జరిగింది. మయన్మార్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం భూమికి 3,500 అడుగుల ఎత్తున ప్రయాణిస్తుండగా కింద భూమినుంచి ఓ తూటా .. విమానంలోకి చొచ్ఛుకుని వచ్చి ప్లేన్ కేబిన్ దగ్గర సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడిని తాకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన తన దవడ,గొంతు కింది భాగంలో రక్తం కారకుండా ఓ టిష్యు పేపర్ తో అద్దుకున్నాడు.
కేబిన్ సిబ్బంది అతని ఫోటోను, బుల్లెట్ కారణంగా విమానానికి పడిన రంధ్రాన్ని ఇన్స్ టా గ్రామ్ లో షేర్ చేశారు. మయన్మార్ విమానాశ్రయానికి ప్లేన్ చేరుకోవడానికి నాలుగు మైళ్ళ దూరంలో ఈ ఘటన జరిగిందని, విమానం ల్యాండ్ కాగానే గాయపడిన ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. 27 ఏళ్ళ ఈ ప్రయాణికుడు నైపిటా నుంచి లోయికాకు ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. లోయికాకు విమాన సర్వీసులనన్నిటినీ రద్దు చేశారు.
మయన్మార్ మిలిటరీ కౌన్సిల్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. తిరుగుబాటుదళాలైన కరెన్నీ నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ సభ్యులే ఈ దాడికి కారణమని ఆరోపించింది. అయితే ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని కరెన్నీ నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ తోసిపుచ్చింది.
పౌరవిమానాలపై తాము దాడులు జరపమని పేర్కొంది. ఏమైనా .. దీనికి కారకులైనవారిపై కఠిన చర్య తీసుకుంటామని, ఇది సైనిక నేరమని, క్రిమినల్ యాక్ట్ అని మిలిటరీ ప్రభుత్వ అధికార ప్రతినిధి మేజర్ జా మిన్ టున్ తెలిపారు. గాయపడిన ప్రయాణికుడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందన్నారు.