పన్ను చెల్లింపుదారుల మనసు గెలుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2022 బడ్జెట్ లో వరాల జల్లులు కురిపించబోతుంది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి పలు ప్రోత్సాహకాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించబోతున్నారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇంకా పాత పన్ను విధానంలోనే ట్యాక్స్ లను చెలిస్తున్నారు. అయితే.. 2020లో ప్రభుత్వం కొత్తగా ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని తెచ్చింది. ఈ కొత్త విధానంలో పన్ను రేట్లను తగ్గించింది. కానీ.. ఇంకా చాలా మంది పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానంలోనే పన్నులను కడుతున్నారు. పాత పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు చాలా మినహాయింపులు ఉండగా.. కొత్త పన్ను విధానంలో అలాంటి మినహాయింపులేమీ లేవు. దీంతో చాలా మంది పాత పన్ను విధానాన్నే ఎంపిక చేసుకుంటున్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరం నుంచే పాత, కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను పన్ను చెల్లింపుదారులకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ, 80డీ కింద పన్ను ప్రయోజనాలు.. ఆదాయపు పన్ను చట్టం కింద హెచ్‌ఆర్ఏ వంటి మినహాయింపులున్నాయి. కానీ.. కొత్త విధానం కింద ఈ మినహాయింపులేవీ లేవు. దీనిలో కేవలం 80సీసీడీ(2) కింద ఆదాయపు పన్ను చెల్లింపుదారునికి ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ పై మాత్రమే పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. దీంతో తక్కువ పన్ను రేటుతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మినహాయింపు రహిత పన్ను విధానం అంతగా పాపులర్ కాలేకపోయింది. ట్యాక్స్ ఫ్రీ సేవింగ్స్ స్కీమ్ లు పీపీఎఫ్, ఎన్‌పీఎస్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టిన వారు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల నష్టపోతారు.
ఒకవేళ తక్కువ పన్ను రేటుతో ఉన్న కొత్త విధానంలోకి మారినా.. వారు ఎలాంటి మినహాయింపులను కోరడానికి అనుమతి లేదు. కాబట్టి తప్పక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాత సిస్టమ్ లో రూ.2 లక్షల వరకు పన్ను డిడక్షన్స్ ను కోరేందుకు అనుమతి ఉంది. మరోవైపు కొత్త పన్ను విధానంలో కూడా తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సినవసరం ఉంటుండటంతో.. చాలా మంది దీని జోలికి వెళ్లడం లేదు. కొత్త పన్ను విధానానికి తగినంత స్పందన రావడం లేదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా నిపుణులు చెప్తున్నారు. రూ.15 లక్షలకు పైగా వేతనం ఆర్జించే వారు కొత్త పన్ను విధానంలో 30 శాతం పన్నును చెల్లించాల్సి వస్తుంది.
ఈ విధానం నుంచి ఎలాంటి ప్రయోజనాలు పన్ను చెల్లింపుదారులు పొందలేనప్పుడు ఎందుకు ఈ విధానాన్ని ఎంచుకుంటారు..? అని ప్రశ్నించారు. అంతేకాక వ్యాపారస్తులకు కూడా ఈ కొత్త పన్ను విధానం కాస్త కష్టంగా ఉంటుందని కొందరు అకౌంటెంట్లు చెప్పారు. ఈ విషయాలన్నింటిన్ని పరిగణనలోకి తీసుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానాన్ని పాపులర్ చేసేందుకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రోత్సాహకాలు మాత్రమే కాక ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తెస్తారని నిపుణులు పేర్కొంటున్నారు.