పశ్చిమ బెంగాల్ లోని సిలిగిరిలో దారుణం జరిగింది. ఢిల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో అంజలి అనే యువతి మృతి చెందిన ఘటన మరువక ముందే .. ఈ సిటీలో స్కూటర్ పై వెళ్తున్న వ్యక్తిని ఓ డంపర్ ట్రక్ ఢీ కొట్టి 1.5. కిలోమీటర్ల దూరం ఈడ్చుకుపోయింది. పైగా ఈ ఘటనలో స్కూటర్ కు నిప్పంటుకుని మంటల్లో దగ్ధం కాగా ఆ ఆ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.
గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ బెంగాల్ క్యాంపస్ వద్ద ఈ ఘటన జరిగిందని తెలిసింది. ఈ ఘోర దుర్ఘటనలో మరణించిన వ్యక్తిని అనంత దాస్ గా గుర్తించారు. వృత్తి రీత్యా వ్యాపారి అయిన ఈయన.. బాగ్ డోగ్రా మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
నిప్పంటుకున్న స్కూటర్ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే అనంత దాస్ మరణించాడు. నిర్లక్ష్యంగా డంపర్ ట్రక్ నడిపిన డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో అశుతోష్ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతనికి చెందిన బాలెనొ కారులోనే ప్రయాణించిన అయిదుగురు నిందితులు అంజలి దారుణ మృతికి కారకులయ్యారని ఖాకీలు వారిపై కేసు పెట్టారు. అశుతోష్ ని అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తుపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారు అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేషన్ జరపడం లేదని ఆమె భావిస్తున్నారు.