భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా త్వరలో వివాహం చేసుకోబోతున్నాడా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అతను మార్చి 4వ తేదీ నుంచి జరగనున్న టెస్టు మ్యాచ్‌కు దూరం కాగా, ఇంగ్లండ్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లకు కూడా దూరం అయ్యాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బుమ్రా త్వరలో వివాహం చేసుకోబోతున్నాడని.. అందుకనే బీసీసీఐ అతనికి సెలవు ఇచ్చిందని తెలుస్తోంది.
బుమ్రా త్వరలో వివాహం చేసుకోనున్నాడని, అందుకనే వివాహ పనుల నిమిత్తం సెలవు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక బుమ్రా ఇటీవల ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో ఆడగా రెండో టెస్టుకు విశ్రాంతి ఇచ్చారు. అహ్మదాబాద్‌లో జరిగిన 3వ టెస్టులో అతను పింక్ బాల్‌తో ఆడాడు. కానీ స్పిన్నర్లు రాజ్యమేలిన ఆ పిచ్‌లో ఫాస్ట్ బౌలర్లకు బౌలింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశం లభించలేదు. ఇక మార్చి 4వ తేదీ నుంచి అహ్మదాబాద్‌లోనే చివరి టెస్టు జరగనుంది. కానీ అది డే మ్యాచ్. సాధారణ బంతితోనే ఆ మ్యాచ్ ఆడనున్నారు. అయితే ఆ మ్యాచ్‌తోపాటు ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డేలు, టీ20లకు కూడా బుమ్రా అందుబాటులో ఉండడం లేదు. ఈ మేరకు బీసీసీఐ ఇటీవలే ఈ విషయాన్ని వెల్లడించింది.
కాగా బుమ్రా 2019లో వెన్నెముకకు గాయం కారణంగా 4 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 2020లో మళ్లీ అందుబాటులోకి వచ్చాడు. కానీ కోవిడ్ కారణంగా అసలు క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. ఈ క్రమంలో కోవిడ్ లాక్‌డౌన్ అనంతరం ఐపీఎల్, ఆస్ట్రేలియా పర్యటనలో పాల్గొన్నాడు. కానీ ఆస్ట్రేలియాలో బుమ్రాకు టీ20లలో విశ్రాంతి ఇచ్చారు. ఇక తాజాగా మళ్లీ బుమ్రా సెలవు తీసుకున్నాడు. త్వరలో అతని పెళ్లి వివరాలు తెలియనున్నాయి.