మనుషుల మధ్య విద్వేషాలు పెరిగిపోయాయి. అంతేనా అనేక దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నపరిస్థితులు. ఇప్పటికే రెండు ఘోరమైన ప్రపంచయుద్ధాలు చూశాం. ఇక మూడో ప్రపంచ యుద్ధం ఏ క్షణాన్నైనా రావొచ్చు..లేదా ఇప్పటికే ఏదో ఒక రూపంలో మూడో ప్రపంచయుద్ధం మొదలై ఉండొచ్చు కూడా. ఇదంతా ఎందుకంటే..అలాంటి యుద్ధమే వస్తే ప్రాణాలు కాపాడుకోవటం ఎలా..?
ఇలాంటి ఆలోచనల్లో నుంచి పుట్టినవే బంకర్ హౌజ్ లు. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ వంటి యుద్ధాల్లో బంకర్ హౌజ్ లను చూస్తున్నాం. కోటానుకోట్లు సంపాదించిన వాళ్లు, దేశాధినేతల రక్షణ కోసం నిర్మించిన బంకర్ ఇళ్లను చూస్తున్నాం. కొన్నిచాలా సాధారణంగా ఏదో కొద్దిరోజులు తలదాచుకోవటానికి నిర్మించినవి అయితే.. మరికొన్ని మాత్రం కొన్ని నెలలపాటు ఎంతో సౌకర్యవంతంగా నివసించేలా ఏర్పాటుచేసిన ఖరీదైన బంక్ హౌజ్ లున్నాయి.
ఇప్పుడు మనం చూడబోయేది అలాంటిదే. దీని ఖరీదు దాదాపు 5 కోట్ల రూపాయలంటేనే అర్థం చేసుకోవచ్చు, దీనిలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో. అంతేనా..దీనిలో శతృభయంకరమైన ఒక ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ కూడా నిలువ చేశారు. అందుకే దీనిని అట్లాస్ ఎఫ్- మిసైల్ కాంప్లెక్స్ అంటారు.
ఈ అధునాతన బంకర్ హౌజ్ అమెరికా నెబ్రాస్కాలోని యార్క్ లో ఉంది. ఇది ఇప్పటిది కాదు దీనిని 1962లో కట్టిఉంటారని అంచనా. దాదాపు 1300 చదరపు అడుగుల ఈ బంకర్ హౌజ్ రెండు అంతస్తులుగా నిర్మితమై ఉంది. అణుదాడులను సైతం తట్టుకోగలగటం దీని ప్రత్యేకత.
మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా తట్టుకునేలా..ఎలాంటి అణుదాడుల నుంచైనా ప్రాణాలకు రక్షణ కల్పించేలా నిర్మించిన ఈ బంకర్ హౌజ్ భూమి ఉపరితలానికి 174 అడుగుల లోతున ఉంది. అలాగే దీని సీలింగ్ కూడా 9 అడుగుల మందంతో నిర్మించారు. ఈ ఇంట్లోకి వెళ్లటం కూడా అంత సులభమేం కాదు. ఒక సొరంగంలాగా ఉండే మార్గంలో నుంచి మెట్లు ఉంటాయి. మొదటి అంతస్తులో వంటగది, పడక గది, స్నానాల గది ఉంటాయి.
ఒక డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లో ఉండే సదుపాయాలన్నీ ఈ ఇంటిలో ఉన్నాయి. ఫ్రిజ్, మైక్రోవేవ్, కొన్ని అవసరాలకు సరిపడా ఫర్నీచర్..బెడ్స్ ఇలా అధునాతన సౌకర్యాలతో నిర్మించారు కాబట్టే అంత ఖరీదు మరి.
ఇంకా ఈ బంకర్ హౌజ్ కు విద్యుత్తు సరపరా ఉండేలా ఏర్పాటుచేశారు. కావాలంటే వేడినీరు, చల్లనీళ్లు లభించే సదుపాయం కూడా ఉంది. కనీసం రెండు మూడు నెలలకు పైగా సరిపడా నిల్వ చేసుకోవటానికి భారీ వాటర్ ట్యాంక్ కూడా దీనిలో ఉంది. సో.. మీకు బంకర్ ఇల్లు కావాలంటే ఈ ఇల్లు కొనుక్కోవచ్చు. ఎందుకంటే యూఎస్ లోని కొన్ని సైట్లలో ఈ ఇంటిని అమ్మకానికి కూడా పెట్టారట.