పుష్ప సినిమా వచ్చింది. కాసుల వర్షం కురిపించింది. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు.. ఇలా అందరికీ లాభాలు తెచ్చిపెట్టింది. మరి ఈ మొత్తం వ్యవహారంలో హీరో పరిస్థితేంటి? అతడు తన రెమ్యూనరేషన్ తోనే సరిపెట్టుకోవాలా? బన్నీకి ఆ అవసరం రాలేదు. పుష్ప సినిమా సక్సెస్, బన్నీకి ఇప్పుడు మరింత ఆదాయం తీసుకొస్తోంది. అది కూడా యాడ్స్ రూపంలో.
అవును.. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప సినిమా సక్సెస్ అవ్వడంతో, కార్పొరేట్ కంపెనీలన్నీ బన్నీని తమ యాడ్స్ లో పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా జొమాటో కంపెనీ, బన్నీని తమ బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంది. తగ్గేదేలే అనే మేనరిజమ్ వచ్చేలా ఓ యాడ్ క్రియేట్ చేసి మార్కెట్లోకి వదిలింది.
కేవలం జొమాటో మాత్రమే కాదు.. ర్యాపిడోకు కూడా బన్నీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. వీటితోపాటు ఆహా, శ్రీచైతన్య ఎండోర్స్ మెంట్స్ కూడా బన్నీ చేతిలోనే ఉన్నాయి. ఇలా పుష్ప సినిమా బన్నీకి యాడ్స్ రెవెన్యూ మరింత పెరిగేలా చేసింది.
మరోవైపు డబ్బుతో పాటు, బన్నీకి క్రేజ్ కూడా పెంచింది పుష్ప సినిమా. బాలీవుడ్ లో ఈ సినిమా సూపర్ హిట్టయింది. వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. దీంతో అల్లు అర్జున్ కు పాపులారిటీ పెరిగింది. అది ఇనస్టాగ్రామ్ లో కనిపించింది. పుష్ప రిలీజైన తర్వాత బన్నీకి ఇనస్టాలో 10 లక్షల మంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు.