“టాలీవుడ్ ను జాతీయ స్థాయిలో నిలబెట్టాలి. సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని అందరూ సెలబ్రేట్ చేయాలి.” గతంలో ఓ సందర్భంలో అల్లు అర్జున్ స్వయంగా చెప్పిన మాటలివి. అక్కడితో ఆగకుండా మహానటి లాంటి కొన్ని హిట్ సినిమాల్ని స్వయంగా బన్నీ సెలబ్రేట్ చేశాడు కూడా. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయన్ని భీమ్లానాయక్ విషయంలో మరిచిపోయాడు.
రీసెంట్ గా సక్సెస్ అయిన సినిమాల్లో భీమ్లానాయక్ కూడా ఒకటి. రెవెన్యూ పరంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రానప్పటికీ.. ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. దీనిపై చాలామంది హీరోలు స్పందించారు. యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పారు. కానీ అల్లు అర్జున్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు.
ఆ సైలెన్స్ ను అలానే కొనసాగిస్తే ఎవ్వరికీ ఏ సమస్య లేదు. భీమ్లానాయక్ సక్సెస్ ను ఎందుకు మెన్షన్ చేయలేదు అని ఎవ్వరూ బన్నీ అడగరు కూడా. కానీ ఇప్పుడు ఆ సినిమా ఆహా ఓటీటీలో వచ్చేసరికి బన్నీకి భీమ్లానాయక్ గుర్తొచ్చాడు. ఆహాలో భీమ్లానాయక్ వస్తోంది తప్పకుండా చూడండంటూ పోస్ట్ పెట్టాడు.
ఆహాకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి భీమ్లానాయక్ సినిమాను చూడండి అంటూ బన్నీ పోస్ట్ పెట్టాడు. ఇందులో తప్పు లేదు. అది వృత్తి ధర్మం కూడా. కానీ అక్కడితో ఆగకుండా భీమ్లానాయక్ హిట్టయినందుకు, పనిలోపనిగా ఇప్పుడు శుభాకాంక్షలు తెలియజేశాడు అల్లు అర్జున్. తను లేట్ అయినప్పటికీ కంగ్రాంట్స్ చెబుతున్నానంటూ మొదలుపెట్టి మరీ పోస్ట్ పెట్టాడు.
దీంతో పవన్ ఫ్యాన్స్ అందుకున్నారు. ఆహాలో భీమ్లానాయక్ రాకపోతే బన్నీ ఎప్పటికీ పవన్ సినిమాకు కంగ్రాంట్స్ చెప్పడంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరికొందరు ఈ పద్దతేం బాగాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.