స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ఎక్కడికక్కడే బెనిఫిట్ షోలు కూడా వేశారు. అయితే అనంతపురం జిల్లా హిందూపురంలో మాత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక బాలాజీ థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో కోసం డబ్బులు వసూలు చేసిందని… అయితే బెనిఫిట్ షో మాత్రం వేయలేదని అభిమానులు ఆందోళనకు దిగారు.
బెనిఫిట్ షో కోసం ఒక్కొక్కరి నుంచి 500 వసూలు చేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు. అయితే థియేటర్ వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారని వారు చెబుతున్నారు. కానీ శుక్రవారం ఉదయం సినిమా థియేటర్ వద్దకు వెళ్తే బెనిఫిట్ షో లేదని చెప్పారు. దీనితో ఆగ్రహంతో అభిమానులు థియేటర్ పై రాళ్లు రువ్వారు.
విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకొని అభిమానులను చెదరగొట్టారు. కాగా ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షో లు వేయరాదని జీవో నెంబర్ 35 రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.