బీసీలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారన్న అసంతృప్తితో టీఆర్ఎస్ ను వీడారు మాజీ ఎంపీ బూర నర్సయ్య. అయితే.. ఆయనకు అన్ని పార్టీల నుంచి పిలుపు అందింది. తమ పార్టీలోకి రావాలని ఒకరి తర్వాత ఒకరు పార్టీలన్నీ వెల్ కమ్ చెప్పాయి. అయితే.. ఆయన మాత్రం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఆయన సమావేశం అయిన ఫోటో ఒకటి బయటకొచ్చింది.
నర్సయ్య ఢిల్లీలో పలువురు బీజేపీ పెద్దలతో సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. రెండ్రోజులు ఢిల్లీలో పడిగాపులు కాసినా తరుణ్ చుగ్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్ చేసిన నేపథ్యంలో నడ్డాతో నర్సయ్య ఉన్న ఫోటో కౌంటర్ గా బయటకు వచ్చిందని చెబుతున్నారు. ఎందుకంటే బీజేపీ నేతలను బూర కలిసి రెండు రోజులు అవుతోంది. అప్పటి నుంచి గోప్యంగా ఉంచి సడెన్ గా ఫోటో బయటకు రావడంపై జగదీష్ కు కౌంటర్ గానే దీన్ని వదిలారని అనుకుంటున్నారు.
ఈ నెల 19న నర్సయ్య బీజేపీలో చేరతారని సమాచారం. సోమవారం ఆయన ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు వెళ్లనున్నారు. పార్టీలో చేరడంపై నర్సయ్యతో చర్చించనున్నారు. బీజేపీ జాతీయ నేతల సమక్షంలో బూర కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28న హైదరాబాద్ లో బీసీ ఆత్మీయసభకు బీజేపీ సిద్ధమవుతోంది.
తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2013లో టీఆర్‌ఎస్ లో చేరిన ఆయన.. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఓడిన తర్వాత నుంచి పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని తన రాజీనామా లేఖలో నర్సయ్య వాపోయారు.