ఉత్తరాఖండ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 32 మంది దుర్మరణం చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. నిన్న రాత్రి పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు 500 మీటర్ల లోతున లోయలో పడిపోయింది. కోద్వార్ జిల్లాలోని సిమిడి గ్రామ సమీపంలో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. హరిద్వార్ జిల్లా లోని లాల్ ధంగ్ ప్రాంతం నుంచి పౌరి జిల్లా బిర్ ఖాల్ కు వెళ్తున్న బస్సుఈ ప్రమాదానికి గురైంది.
బస్సులో మహిళలు, పిల్లలతో సహా దాదాపు 50 మంది ఉన్నట్టు తెలిసింది. ప్రమాద సమాచారం తెలిసినవెంటనే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. వాతావరణం బాగులేని కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టు భావిస్తున్నారు.
ఈ ప్రమాదం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ దుర్ఘటనలో 21 మందిని రక్షించినట్టు పౌరి జిల్లా అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో స్థానికులు కూడా సహాయకబృందాలకు తోడ్పడుతున్నారని వారు చెప్పారు. రాత్రి పొద్దుపోయేవరకు సహాయక చర్యలు కొనసాగాయి. ఉత్తరాఖండ్ లోనే కొండ చరియలు కూలిపోగా ట్రెక్కింగ్ చేస్తున్న పలువురు మృతి చెందిన రోజే ఘోర ప్రమాదం జరిగింది.