డ్రైవర్ కు గుండెపోటు రావడంతో అదుపుతప్పిన బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ విషాదకర ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో యాత్రికులు వెళ్తుండగా.. బస్సు డ్రైవర్ కు ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. డ్రైవర్ మృతి చెందడంతో బస్సు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది.
వెంకటాపురం మండలం వీరభద్రపురం వద్ద ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
కొందరికి స్వల్ప గాయాలు కాగా, వారిని వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు. బస్సులోని వారు కాణిపాకం నుంచి యాదాద్రి వెళ్తున్నారు. వారంతా చిత్తూరు జిల్లాకు చెందినవారని గుర్తించారు.
కాగా డ్రైవర్ ఒక్కసారిగా సీటులోనే ఒరిగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. పొదల్లోకి వెళ్లి ఆగిపోయిన బస్సు నుంచి వెంటనే కిందికి దిగిపోయారు. వారిలో కొందరు 108కి ఫోన్ చేయగా, ఆరోగ్య సిబ్బంది వచ్చి పరీక్షించగా, డ్రైవర్ అప్పటికే మరణించినట్టు వెల్లడైంది.