ఎయిరిండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బిజినెస్ మన్ శంకర్ మిశ్రాకు ఢిల్లీలోని పటియాలా కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇతడిని బెంగుళూరులో గతవారం పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా 14 రోజుల జుడిషియల్ కస్టడీకి కోర్టు రిమాండ్ చేసింది.
తనకు నేర చరిత్ర ఏదీ లేదని, సాక్షులను ప్రభావితం చేసే స్థితిలో లేనని, అందువల్ల తనకు బెయిల్ ఇవ్వాలని శంకర్ మిశ్రా తన పిటిషన్లో కోరాడు. తన అరెస్టు అక్రమమని కూడా పేర్కొన్నాడు. ఇప్పటికే తాను నో ఫ్లై లిస్ట్ లో ఉన్నప్పటికీ విచారణ కమిటీకి సహకరించానని, పైగా బాధిత మహిళతో విషయాన్ని సానుకూలంగా పరిష్కరించుకున్నానని తెలిపాడు.
నేనెక్కడికీ పారిపోయేవాడిని కానన్నాడు. ఇన్ని చెప్పినా కోర్టు అతనికి బెయిల్ తిరస్కరించింది. శంకర్ మిశ్రా నిర్వాకం తెలిసి .. ఇతని కంపెనీ ‘వెల్స్ ఫార్గో’ ఇతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. గత ఏడాది నవంబరు 26 న న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో సాగించిన శంకర్ మిశ్రా ఉదంతం ఒకవిధంగా ఈ ఎయిర్ లైన్స్ ని కూడా అప్రదిష్ట పాల్జేసింది.
మిశ్రా వ్యవహారాన్ని విమాన సిబ్బంది పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఇంత జరిగినా ఇతని తండ్రి… జరిగిన ఘటనలో తన కొడుకు తప్పిదమేమీ లేదని సమర్థించడం విశేషం.