ప్రచారం.. ఈరోజుల్లో ఏ విషయంలోనైనా ఇదే కీలకం. మార్కెట్ లోకి ఏదైనా కొత్త వస్తువు వస్తున్నా.. ప్రభుత్వం కొత్త పథకాన్ని తెస్తున్నా ప్రచారం అనేది కామన్. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చే యాడ్స్ ఎంత ఆసక్తికరంగా ఉంటాయో మనకు తెలుసు. వాళ్ల టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రజలకు ఎన్నో బంపరాఫర్లు ప్రకటిస్తుంటారు. టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తుంటారు. తాజాగా ఢిల్లీ శివారులో కడుతున్న ట్రంప్ టవర్ కు సంబంధించిన యాడ్ ఒకటి బాగా వైరల్ అవుతోంది.
గురుగ్రామ్ లోని ట్రంప్ టవర్స్ ఫ్లాట్ ను కొనుగోలు చేస్తే.. స్పేస్ కు దగ్గర వరకు వెళ్లే రష్యాకు చెందిన మిగ్-29 జెట్ లో ప్రయాణం చేయొచ్చని ప్రకటన ఇచ్చారు. అంతేకాదు ఎంతో ఫేమస్ అయిన స్పోర్ట్స్ కారు లంబోర్ఘినిలో డ్రైవింగ్ చేసే అవకాశం ఇస్తామని.. అదికూడా మంచులో అని తెలిపారు. అలాగే ట్రంప్ గోల్ఫ్ రిసార్ట్ లో ఎక్స్ పర్ట్స్ తో పాఠాలు నేర్పిస్తామని ఆఫర్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటన నెట్టింట వైరల్ గా మారింది.
ట్రంప్ ఆర్గనైజేషన్ 2018లో భారతదేశంలో తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. గురుగ్రామ్ లోని ప్రాజెక్ట్ ను M3M ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో కలిసి సంయుక్తంగా నిర్మాణం చేస్తోంది. 47 అంతస్తుల్లో నిర్మించే ఈ టవర్స్ లోని ఫ్లాట్ రూ.7 నుంచి 11.5 కోట్ల మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఇంకో రెండేళ్ల లోపు దీని నిర్మాణం పూర్తి చేయాలని చూస్తున్నారు.