– భూముల అగ్రిమెంట్లతో డబ్బుల సంచులు
– దుబ్బాక నుంచి మునుగోడు వరకు అదే తంతు
– ఇచ్చిన వారికే ఎగనామం?
– హుజూరాబాద్ కు రూ.50 కోట్లు సమకూర్చిన మాజీ ఎంపీ?
– సమయానికి చేతులెత్తేస్తున్న ఈటల?
– హై కమాండ్ దృష్టికి పంపకాల పంచాయితీ?
– నోటీసులు ఇచ్చేందుకు రెడీ?
– వందల కోట్ల ఖర్చు గుట్టు రట్టయ్యేనా?
– ప్రభుత్వాలు మారితే నగదు నాటకాలు బయటపడేనా?
తొలివెలుగు క్రైం బ్యూరో..
క్రైంబ్యూరో, తొలివెలుగు:దేశంలో ఏ రాజకీయ నాయకుడ్ని అడిగినా తెలంగాణలో ఎన్నికలు చాలా కాస్ట్లీ అని ఠక్కున చెబుతారు. ఉప ఎన్నికలు వస్తే ప్రధాన పార్టీలు వందల కోట్లు కుమ్మరించాల్సిందే. పంపిణీల వ్యవహారానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటపడినా ఎలక్షన్ కమిషన్ కండ్లు మూసుకుంటుంది. కోట్లాది రూపాయల డబ్బు సంచులు ఎవరు పంపింగ్ చేస్తున్నారు..? ఎక్కడ నుంచి వస్తున్నాయో..? అనేది కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. ఎన్నికలు ముగిసిన తెల్లవారే అందరూ మరిచిపోతారు.
కానీ, ఇచ్చి, పుచ్చుకున్న వారి లావాదేవీల బాధలు, గొడవలు అప్పుడప్పుడు రచ్చకెక్కుతాయి. ఇప్పుడు బీజేపీలో అదే జరుగుతోందని తెలుస్తోంది. పంపకాల పంచాయితీ, రికవరీ లొల్లి హైకమాండ్ వరకు వెళ్లినట్లు సమాచారం. కేంద్రంలో ప్రభుత్వం ఉండటంతో నగదు వ్యవహారంపై బయటకు చెప్పుకున్నా అంతగా వివాదం అవడం లేదని అందరూ చర్చించుకుంటున్నారు.
దుబ్బాక టు మునుగోడు…!
తెలంగాణలో బీజేపీ బలపడాలంటే ఎన్నికల్లో గెలవాలి. అసెంబ్లీలో సీటు పెరగాలంటే ఈ రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేయాలి. రాష్ట్రంలో అధికారం లేకుంటే డబ్బుల సంచులు సమకూర్చడం అంత ఈజీ కాదు. కానీ, పారిశ్రామికవేత్తగా ఉండటంతో పార్టీలో అంతా తానై చూసుకున్నారు మాజీ ఎంపీ. దుబ్బాకలో ఎలాంటి అగ్రిమెంట్స్ చేయించుకోకుండానే తన బేగంపేట కార్పొరేట్ ఆఫీస్ నుంచి రూ.10 కోట్ల వరకు సర్దినట్లు సమాచారం. అప్పట్లో దాన్ని పోలీసులు పట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక హుజూరాబాద్ ఎన్నికల్లో భూ విక్రయ పత్రం పెట్టుకుని రూ.50 కోట్ల నగదు పంపింగ్ జరిగినట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అందరూ మర్చిపోయినప్పటికీ ఇంకా ఆ లావాదేవీల పంచాయితీ కొనసాగుతోంది. తాను ఎన్నికల ఇంచార్జీగా ఉన్న మునుగోడు ఎన్నికలకు ఆ డబ్బులు పెట్టాలని హుజూరాబాద్ ఎమ్మెల్యేను అడిగినా సమకూర్చలేకపోయారని తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య చాలా గ్యాప్ పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మునుగోడులో గెలుపు ముంగిటకు వచ్చి ఓడిపోవడంతో మూడు ఎన్నికల్లో డబ్బులు పెట్టినా ఫలితం లేదని సదరు నేత మదనపడుతున్నట్లు సమాచారం. మునుగోడు ఖర్చుకి రాజగోపాల్ రెడ్డికి చెందిన కోకాపేటలోని తన భూమిని ఆ ఎంపీ కంపెనీకి అగ్రిమెంట్స్ చేయించి ఇచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు. నగదు పంపింగ్ చేశారని అనుకుంటున్నారు.
ఈటలకు నోటీసులు పంపిస్తున్నారా..?
కేసీఆర్ అహంకారానికి, ఈటల రాజేందర్ అత్మగౌరవానికి జరిగిన ఎన్నికల్లో డబ్బులదే పైచేయి అని చర్చలు నడుస్తున్నాయి. ఈ డబ్బులు సమకూర్చిన వారికి ఈటల రాజేందర్ సరైన సమయంలో ఇవ్వలేదని అసంతృత్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏడాది దాటినా నగదు రాకపోవడంతో ఆ డబ్బు సమకూర్చిన పారిశ్రామిక వేత్త కమ్ పొలిటీషియన్ లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీని బలోపేతం చేసే విషయం దేవుడెరుగని, తాను చితికిపోతున్నానని సన్నిహితులతో సదరు నేత వాపోతున్నట్టు సమాచారం. రాజగోపాల్ రెడ్డికి ఆ మాజీ ఎంపీ కంపెనీకి రూ.140 కోట్ల భూ ఒప్పందంలో వివాదాలు ఉన్నప్పటికీ అవసరానికి ఎప్పుడైనా నగదు సమకూర్చే కెపాసిటీ ఉండటంతో ఇద్దరి మధ్య ఓ కమిట్ మెంట్ ఉందని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.
ఇలా అయితే కష్టమే..?
అధికారంలోకి రావాలనుకుంటున్న కాషాయం పార్టీకి ఎన్నికల ఖర్చు సవాలుగా మారుతోంది. కొందరు ఖర్చుకు భయపడి సీటు మీకిచ్చేస్తాను ఎంతిస్తారంటూ బేరసారాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లాలో ఓ అధ్యక్షుడికి తన టికెట్ వేరే వాళ్లకి ఇప్పిస్తానంటూ ఇప్పటికే 6 కోట్లతో ఇల్లు కట్టించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమలానికి ఖర్చు పెడితే తిరిగి వస్తాయో రావోననే భయం పారిశ్రామిక వేత్తల్లో పట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
గులాబీ పార్టీకి మాత్రం రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా పెట్టుబడిదారులు ఉండటం కలిసివస్తోంది. ఎప్పటికైనా ప్రభుత్వాలు మారితే ఈ ఫండింగ్స్ పై అందరికీ ఉచ్చు బిగుసుకునే అవకాశాలు లేకపోలేదు. ఐటీ, ఈడీలు ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకపోయినప్పటికీ 8 ఏండ్ల వరకు ఈ లెక్కలు చెప్పాల్సిందే. దర్యాప్తు చేస్తే 16 సంవత్సరాల వరకు తెర వెనుక వ్యవహారాలు వెంటాడుతూనే ఉంటాయి.