మునుగోడు ఉపఎన్నిక కోసం తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. పల్లె వినయ్ గౌడ్ ను బరిలోకి దింపబోతున్నట్లు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల ఆధిపత్య పోరు మునుగోడు ఉప ఎన్నికకు కారణం అయిందని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు అడ్డగోలుగా ఆస్తులు కూడగొట్టుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రయోజనాలు వదిలేసి జాతీయ రాజకీయాల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ జన సమితి పోరాటం చేస్తుందని చెప్పారు. గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన కోదండరాంకు మునుగోడు నుంచి మంచి స్పందన రావడంతో ఇక్కడ పోటీ చేసేందుకు టీజేఎస్ సిద్ధమైంది.
బోడంగిపర్తి గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కుటుంబంలో 10 జూన్ 1970లో జన్మించిన వినయ్ కుమార్ గౌడ్ గతంలో గ్రామ సర్పంచ్ గా పని చేశారు. గతంలో ప్రైవేట్ పాఠశాలను స్థాపించి కొనసాగించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వినయ్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రొ.కోదండరాం నాయకత్వంలో పని చేస్తున్నారు.
పోరాటాల కుటుంబ నేపథ్యంతో పాటు గౌడ సామాజిక వర్గానికి ఈ సెగ్మెంట్ లో పెద్ద సంఖ్యలో ఓటు బ్యాంక్ కలిగి ఉండటంతో పల్లె వినయ్ కుమార్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే మునుగోడులో గద్దర్ ను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు కోదండరాం చెప్పారు. కానీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇదివరకే గద్దర్ ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించేశారు. అయినా ఈ విషయంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నప్పటికీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ టీజేఎస్ ఇవాళ తమ అభ్యర్థిని ప్రకటించింది.