తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్,రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి, మహారాష్ట్రలో రెండు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల తాలూకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ బై పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు లోని ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకెఎస్ ఇలంగోవన్ తన సమీప ప్రత్యర్థి అన్నా డీఎంకే అభ్యర్థి కెఎస్. తెన్నారసు కన్నా లీడింగ్ లో ఉన్నారు. ఇక్కడ ఇలంగోవన్ కి డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్ మద్దతునిస్తున్నారు. మధ్యాహ్న సమయానికి ఇలంగోవన్ .. తెన్నారసు కన్నా 46,072 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
. తన గెలుపు ఖాయమని ఆయన అప్పుడే ప్రకటించగా.. ఈ ఫలితం ద్రవిడియన్ మోడల్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన పెను మద్దతుగా స్టాలిన్ అభివర్ణించారు. ఈ నియోజకవర్గ ఓటర్లు ఏఐఏడీఎంకేకి గట్టి గుణపాఠం నేర్పారన్నారు. ఇక ఈ ఫలితాన్ని ప్రతివారూ ముందే ఊహించారని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు.
డీఎంకే-కాంగ్రెస్ కూటమిని ప్రజలు ఆదరించారని ఆయన చెప్పారు. ఈ సీటును భారీ మెజారిటీతో తాము దక్కించుకోవడం ఖాయమన్నారు. బెంగాల్ లోని ముర్షీదాబాద్ పరిధిలోగల సాగర్ దిగీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థికన్నా లీడింగ్ లో ఉన్నారు.
మహారాష్ట్ర పూణే లోని కస్బా పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ధన్ గే కర్ రవీంద్ర హేమ్ రాజ్ విజయం సాధించారు. బీజేపీకి గట్టి పట్టున్న ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. . దీంతో మహా వికాస్ అఘాడీ కార్యకర్తలు విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. అయితే పూణే లోని చించ్ వాడ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని షెరింగ్ లాము నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థికన్నా లీడింగ్ లో ఉన్నారు.