ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో టెక్ కంపెనీలు పొదుపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు లే ఆఫ్ లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎడ్యుటెక్ యూనికార్న బైజూస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.
ఏకంగా 1000 మంది ఉద్యోగులను తొలగించినట్టు పేర్కొంది. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన 15శాతం మంది ఉన్నారని పేర్కొంది. డిజైన్ తో పాటు ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇలా ప్రతి టెక్ విభాగంలోనూ ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది.
ఇంజినీరింగ్ టీమ్‌లలో 15 శాతం మందిని ఉద్యోగులను తొలగించినట్టు బైజూస్ టీమ్‌లో ఇంజినీరింగ్ టీమ్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. తాజా రౌండ్ లేఆఫ్ లో భాగంగా ఫ్రెషర్స్ అందరినీ కంపెనీ తొలగించిందని ఆమె వివరించారు. తొలగింపుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
తొలగింపులపై గతేడాది బైజూస్ ముందస్తు ప్రకటన చేసింది. ఇక పెరుగుతున్న నష్టాలను, ఖర్చులను తగ్గించే ప్రక్రియలో భాగంగా అన్ని డిపార్టమెంట్లలో సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు పేర్కొంది. తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని కంపెనీ సీఈఓ రవీంద్రన్ తెలిపారు.