కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు పారాసెటిమల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ సెటైర్ వేశారు. బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి . జగన్ తానే ఒక శాస్త్రవేత్త అన్నట్లు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో స్థానిక ఎన్నికలను జరపకూడదని ఎన్నికల సంఘానికి రెండు రోజుల క్రితమే తాను ఫిర్యాదు చేశానని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ రమేష్ కుమార్ రియల్ హీరో అని బైరెడ్డి ప్రశంసించారు.
కరోనా వైరస్‌పై సీఎం జగన్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాల క్లిప్పింగ్స్‌ను రాష్ట్రపతి, గవర్నర్, డబ్ల్యూహెచ్‌వో, నేషనల్ హ్యూమన్ రైట్స్, విదేశీ ఆరోగ్య సంస్థలకు పంపిస్తానని ఆయన తెలిపారు. ప్రజలు చచ్చినా పర్లేదు కానీ, తాను రాజకీయ లబ్ధి పొందాలని జగన్ భావిస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. సీఎం మరో ప్రెస్‌మీట్ పెట్టి కరోనాపై వాస్తవాలను జనానికి తెలియజేశాలని సూచించారు.ముఖ్యమంత్రి జగన్ కమ్మ సామాజిక వర్గంపై పడ్డారని, కమ్మ సోదరులు మేల్కోవాలని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సూచించారు. కమ్మ సోదరుల పోరాటానికి తాను మద్దతు తెలుపుతానన్నారు. వ్యాపారం పరంగా జగన్‌కు కమ్మ కులం కావాలి కానీ, రాజకీయంగా వద్దా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌కు సీఎం జగన్ నుంచి ముప్పు ఉందని, ఆయన రక్షణను పెంచుకోవాలని బైరెడ్డి సూచించారు.