హీరో సత్యదేవ్ కు థియేట్రికల్ మార్కెట్ లేదు. ఈ విషయాన్ని అతడు కూడా అంగీకరిస్తాడు. ప్రస్తుతం ఈ హీరో సినిమాలు చేస్తున్నారంటే దానికి కారణం అతడికి ఓటీటీ మార్కెట్ ఉండడమే. అయితే అది కూడా ఇప్పుడు లేదంటున్నాడు నిర్మాత సి.కల్యాణ్. సత్యదేవ్ హీరోగా గాడ్సే సినిమా తీసిన ఈ ప్రొడ్యూసర్.. సత్యదేవ్ కు అసలు మార్కెట్ లేదని తెగేసి చెబుతున్నాడు.
“గాడ్సే సినిమాను నేను నాలుగున్నర కోట్లకు డిజిటల్ అమ్మాను. ఆ రేటు చూపించి, మిగతా జనాలు సత్యదేవ్ తో సినిమా చేసేందుకు నిర్మాతల్ని ఒప్పిస్తున్నారు. కానీ గాడ్సే సినిమా సత్యదేవ్ వల్ల అమ్ముడుపోలేదు. నా పరిచయాలతో నేను అమ్ముకున్నాను. ప్రస్తుతం సత్యదేవ్ నటించిన సినిమాలకు డిజిటల్ అమ్ముడుపోవడం లేదు. అతడి ఓటీటీ మార్కెట్ పడిపోయింది.”
ఇలా సత్యదేవ్ మార్కెట్ పై సునిశితంగా స్పందించాడు సి.కల్యాణ్. సత్యదేవ్ ను తనే హీరోను చేశానని, అలాంటి తనకే ప్రచారానికి సహకరించకుండా సత్యదేవ్ నిరాకరించాడని ఆరోపించారు సి.కల్యాణ్. గాడ్సే సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కోటిన్నర ఖర్చు పెట్టి ప్రమోషనల్ టూర్ పెడదామంటే, గుంటూరు వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోతానని సత్యదేవ్ ఆబ్లిగేషన్ పెట్టాడని, దీంతో తను ప్రచారం చేయలేకపోయానని వెల్లడించారు.
ఇదే విషయంపై సత్యదేవ్ కూడా ఆఫ్ ది రికార్డ్స్ స్పందించాడు. గతంలో సి.కల్యాణ్ కు తను అలా చెప్పిన మాట నిజమేనని, మరో సినిమాతో క్లాష్ అవుతున్న కారణంగా అలా చెప్పానని, అయినా తను గుంటూరు మాత్రమే స్కిప్ చేయమన్నానని, మిగతా అన్ని ప్రాంతాలకు వస్తానని సి.కల్యాణ్ తో చెప్పినట్టు సత్యదేవ్ సమర్థించుకున్నాడు.