నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకు వస్తే దేశంలో మైనార్టీల పాత్ర తగ్గి, మెజారిటీ శక్తులను అది ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…
ఈ సమాజంలో అన్ని వర్గాలకు న్యాయమైన రాజకీయ వ్యవస్థ, మంచి జాతీయ గుర్తింపు కోసం జాతి పిత మహాత్మ గాంధీ ఎంతో కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. తనకు తెలిసినంత వరకు సీఏఏను అమలు చేయడం ద్వారా మైనార్టీల పాత్రను తగ్గించడం బీజేపీ ఉద్దేశాల్లో ఒకటన్నారు.
దేశంలో మైనార్టీలకు ఉన్న ప్రాముఖ్యతను చాలా వరకు తగ్గించి, ప్రత్యక్ష-పరోక్ష మార్గంలో దేశంలో హిందూ మెజారిటీ వర్గాల పాత్రను పెంచడం, అందు కోసం మైనారిటీలను బలహీనపరచడం బీజేపీ ఉద్దేశమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ ఎనిమిదేండ్లలో ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ పనితీరు మెరుగుపడిందా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ… మెరుగుపడిందని తాను అనుకోవడం లేదన్నారు. దేశానికి కావలసిందల్లా ప్రతి భారతీయుడికి కొన్ని హక్కులు ఉన్నాయని గుర్తించడమేనని తాను భావిస్తున్నానన్నారు.