దేశ ఐక్యత, అభివృద్ధిని కాక్షించే వారే పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఒక్క మైనార్టీలే కాదు..దేశ ఐక్యతను కోరుకునే వారందరూ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. నిరసనలను ప్రభుత్వం తీవ్రంగా అణిచివేస్తుందని…ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించిన మరునాడే శరద్ పవార్ అ వ్యాఖ్యలు చేశారు.
పౌరసత్వ చట్టం మత, సామాజిక ఐక్యతను, దేశ సామరస్యాన్ని దెబ్బతీస్తాయని శరద్ పవార్ అన్నారు. ఎందుకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ దేశాల నుంచి వచ్చిన వారికే పౌరసత్వం ఇస్తున్నారు..? శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పన్నిన కుట్రనే సీఏఏ, ఎన్ఆర్సీ అని చెప్పారు.
సీఏఏ కేంద్ర చట్టం…దీన్ని అమలు చేయాల్సింది రాష్ట్రాలు…ఎన్.ఆర్.సి ని అమలు చేసేందుకు రాష్ట్రాల దగ్గర సరైన యంత్రాంగం ఉందా ? అని శరద్ పవార్ అడిగారు. బీజేపీ మిత్ర పక్షాలు అధికారంలో ఉన్న బీహార్ తో సహా 8 రాష్ట్రాలు పౌరసత్వ చట్టాన్ని అమలు చేయడానికి నిరాకరించాయి. మహారాష్ట్ర అదే నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.