అసెంబ్లీలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి హరీశ్ రావు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. దీంతో అసెంబ్లీలో సోమవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు హరీశ్.
బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలు, కేటాయింపులు సహా ఇతర అంశాలను వివరించారు. ఇది 2023 ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి చివరి బడ్జెట్. అందుకే.. అమలు తీరుతెన్నులు, అనుసరించాల్సిన కార్యాచరణపై కేసీఆర్ మంత్రులకు వివరించినట్లు సమాచారం.
గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈసారి బడ్జెట్ ను ప్రవేశ పెడుతోంది ప్రభుత్వం. ఈ విషయంలో వివాదం చెలరేగుతున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది. పాత సెషన్ నే కొనసాగిస్తున్నామని చెబుతోంది.
మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. అటు అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 12వందల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.