శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలకు ముందు మంత్రి మండలి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సీఎం అధ్యక్షతన జరిగే మంత్రిమండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా సొంత స్థలాలు ఉన్న పేదల గృహ నిర్మాణానికి రూ.మూడు లక్షల అందించే పథకం అమలు తేదీ, కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేస్తారని సమాచారం.రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష, రైతుబంధు నిధుల విడుదల, నియోజకవర్గానికి 500 చొప్పున దళితబంధు యూనిట్ల మంజూరు తదితర అంశాలపైనా మంత్రి మండలి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ప్రస్తుతం గవర్నర్ ఛాన్స్‌లర్‌గా ఉన్నారు.
ఆ స్థానంలో సీఎంను ఛాన్స్‌లర్‌గా నియమించేందుకు వీలు కల్పించే బిల్లును శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు వీలుగా మంత్రి మండలిలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. గత సెప్టెంబరు 13న రాష్ట్ర శాసనసభ, మండలి ఏకగ్రీవంగా ఆమోదించిన ఎనిమిది బిల్లుల్లో ఏడింటిని గవర్నర్ పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే.
ఈ అంశంపైన చర్చించడంతోపాటు బిల్లుల ఆమోదంలో జాప్యం వల్ల ఏర్పడిన సమస్యలు, ఇతర పర్యవసానాలను తెలియజేస్తూ వాటిని వెంటనే ఆమోదించాలని గవర్నర్‌ను కోరుతూ మరో తీర్మానం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులపై…
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మంత్రులను, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ సోదాలు జరగడంపైనా మంత్రిమండలి చర్చించనుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.