వారిని గుర్తించకుండా , లాక్ డౌన్ చేసినా ఏం ఉపయోగం?
విదేశాల నుండి వచ్చిన విమాన ప్రయాణీకులకు, క్వారంటైన్ లో ఉన్న విదేశీ ప్రయాణీకుల సంఖ్యకు ఎందుకంత తేడా?
భయం పుట్టిస్తున్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా లేఖ
దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి నెమ్మది చేయడంలో సక్సెస్ అవుతున్నాం. అయినా ఉపయోగం లేదా? అంటే వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాసిన లేఖ భయం పుట్టిస్తోంది.
ఆ లేఖలో చెప్పిన దాని ప్రకారం, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా జనవరి 18 నుండి మార్చ్ 23 వరకు ఈ రెండు నెలల కాలం లో విదేశాల నుండి మన దేశానికి వచ్చిన వారి సంఖ్య అక్షరాల 15లక్షలు.ఇందులో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రయాణీకులు ఉన్నారు.కరోనా వైరస్ సోకిన వెంటనే లక్షణాలు వెంటనే కనిపించవు. 14 రోజుల లోపు ఎప్పుడైనా లక్షణాలు కనిపిస్తాయి. ఆలోపు విదేశీ ప్రయాణీకుల ను క్వారైంటెన్ చేయాలి. కానీ రాష్ట్రాల్లో , కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్వారంటైన్ లో ఉన్న వారి లెక్కలకు, విదేశాల నుండి వచ్చిన 15 లక్షల లెక్కకు చాలా తేడా ఉంది.
మరి మిగతా వారు ఎక్కడ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కూడా కనీస సమాచారం కూడా లేదు. ఈ గ్యాప్ ను పూర్తి చేసి అందరినీ గుర్తించి , క్వారంటైన్ చేయకపోతే కరోనా ను నియంత్రించడానికి చేస్తున్న లాక్ డౌన్ లాంటి ప్రయత్నాలను దెబ్బతీస్తుందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పేర్కొన్నారు.
అందుకే విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకులు స్వచ్చందంగా హోమ్ క్వారంటైన్ కి వెళ్ళాలి. లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను సంప్రదించాలి. కానీ ఇప్పటికే తప్పించుకుని బయట తిరుగుతున్న విదేశీ ప్రయాణీకులు దేశంలో ఉన్న ఎంతమందికి ఈ కరోనా మహమ్మారిని అంటించారో అని జనం భయపడుతున్నారు
కానీ , లాక్ డౌన్ చేయడం వల్ల ఇంటి నుండి అడుగు బయట పెట్టకుండా ఉంటే కరోనా రాకుండా కచ్చితంగా బయటపడొచ్చు. ఇలాంటి వారు బయట ఉన్నారన్న భయంతో అయినా బయట తిరగొద్దని అధికారులు అంటున్నారు.