ఇళ్ల స్థలాలు, సంబంధిత అంశాల పరిష్కారంపై మంత్రి వర్గ ఉపసంఘం సోమవారం హైదరాబాద్ లో భేటీ అయింది. బీఆర్కే భవన్ లో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఇళ్ల స్థలాలు, నిరుపేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సహా సంబంధిత అంశాలన్నింటిపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
ఈ సమావేశం అనంతరం కేటీఆర్ పలు కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కాగా డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటోంది. జిల్లా స్థాయిలో కలెక్టర్లకు బాధ్యతలు ఇచ్చింది. ఈ పథకం కోసం బస్తా సిమెంట్ ను రూ.230కే ఇచ్చేలా ఇప్పటికే సిమెంట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం.
అలాగే ఈ కార్యక్రమంలో గుత్తేదారులు ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలుగా ఈఎండీ మొత్తాన్ని 2.5 శాతం నుంచి ఒక శాతానికి, ఎఫ్ఎస్ డీ మొత్తాన్ని 7.5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. అలాగే లబ్ధిదారుల ఎంపిక కోసం మంత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలతో జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, ఈ కమిటీకి కన్వీనర్ గా కలెక్టరును నియమించింది.